బతుకమ్మ పండుగ విశేషాలు (Bathukamma Festival)

Spread the word

Introduction

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ (Bathukamma festival). బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఆ రోజు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

ఆడవారికి మాత్రమే చెందిన పండుగ ఈ బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ మధ్యలో పెట్టి, బతుకమ్మను గౌరీ దేవిగా పూజిస్తారు. తెలంగాణ ప్రజలు మంగళగౌరిని తమ ఇంటి అమ్మాయిగా భావిస్తారు. పసుపు గౌరమ్మను పుస్తెలకు అద్దుకుని తమ మాంగళ్యం బాగుండాలని కోరుకుంటారు.

పూల జాతర, ప్రకృతి వేడుకగా తెలంగాణ నేల జరుపుకొనే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ప్రకృతి సిద్ధమైన గునుగు పూలు, సొంపు పూలు, తోక చామంతి, చిట్టి చామంతి, గులమాల పూలు, తంగేడు పూలు, ఎర్ర గన్నేరు, పచ్చ గన్నేరు, బంతి పూలను సేకరించి ఒక పళ్లెంలో గుండ్రంగా అమరుస్తారు. వీటి అమరిక ఎంతో కళాత్మకంగా ఉంటుంది. రంగు రంగుల పూలను నేర్పుగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.

ఇలా పేర్చిన బతుకమ్మను వివిధ ముగ్గులు వేసి, వాటి మధ్యలో అందంగా అలంకరించిన బతుకమ్మను పెట్టి పండుగ చేస్తారు. బతుకమ్మ ముగ్గులకై మీరు మా ఈ ఆర్టికల్ ను చూడండి.

ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ స్త్రీలకి మహా ఇష్టమైన పండుగ. బంధుమిత్రులతో కలిసి కోలాహలంగా ఆడిపాడతారు.

స్త్రీలు, యువతులు అందమైన వస్త్రాలు ధరించి, రంగు రంగుల గాజులను చేతికి ధరించి వలయాకారంలో బతుకమ్మ చుట్టూ చుట్టూ చప్పట్లు చరుస్తూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడుతూ-పాడుతూ బతుకమ్మను పూజిస్తారు.

ప్రకృతిలోని చెట్టు-చేమ, రాయి-రప్ప, పువ్వు-మొగ్గ ఇలా అన్నింటిని పూజించడం హైందవ సంప్రదాయం. కాలానుగుణంగా మారే ఋతువులను అనుసరించి పండుగలు చేసుకుంటాము. అలా ఏర్పడింది తెలంగాణ ప్రాంతం అంతటా స్త్రీలు ఆనందోత్సాహాలతో ఆడిపాడే పండగే బతుకమ్మ పండుగ.

తెలంగాణలో మాత్రమే జరుపుకొనే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించుకుని నిర్వహిస్తున్నారు.

Bathukamma History

బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది అని ముఖ్యంగా 5 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

స్టొరీ -1

వెయ్యి సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతం కల్యాణి చాళుక్యుల పాలనలో ఉండేది. వేములవాడ చాళుక్యులు వీరికి సామంతులుగా ఉన్నారు. ఆ సమయంలో కల్యాణి చాళుక్యులకు, చోళులకు మధ్య యుద్ధం జరిగింది. ఇందులో వేములవాడ చాళుక్యులు కల్యాణి చాళుక్యుల పక్షం వహించారు. అప్పటికే వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ సమయంలో చోళ చక్రవర్తి రాజరాజు కుమారుడు రాజేంద్ర చోళుడు ఈ ఆలయంలోని భారీ శివలింగాల్ని పెకలించి తీసుకెళ్లి తండ్రికి బహుమతిగా ఇచ్చాడట. ఇక్కడి బృహదమ్మ (పార్వతి) నుంచి బృహదీశ్వరుడిని వేరుచేయడంతో తెలంగాణ ప్రజలు నొచ్చుకున్నారు. ఆమెకు సాంత్వన చేకూర్చేందుకు శివలింగాకృతిలో గౌరీదేవి రూపంగా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటలు ఆడారట. ఈ ఘటనకు గుర్తుగా ప్రతి ఏడాదీ ఇలా చేస్తున్నారని కథ. బృహదమ్మ (గొప్పది)నే జన వ్యవహారంలో ‘బతుకమ్మ’గా మారిందని అంటారు.

స్టొరీ – 2

మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి అలసిపోయి మూర్ఛిల్లిందట. అప్పుడు ఆమెను మేలుకొలిపేందుకు దేవుళ్లంతా పూలగౌరమ్మను పేర్చి పాటలు పాడారట. బతుకమ్మా బతుకమ్మా అంటూ వేడుకున్నారట. ఇది జరిగింది దసరా నవరాత్రుల్లోనేననీ, అప్పటినుంచీ అమ్మ విజయానికి గుర్తుగా బతుకమ్మ వేడుక చేసుకుంటున్నారనీ మరో కథనం.

స్టొరీ – 3

పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకు ఏడుగురు కొడుకులు, ఒక్కతే కూతురు. ఆమె పెళ్లి చేసి తల్లిదండ్రులు కాశీయాత్రకు వెళతారు. ఈ మధ్యకాలంలో కూతురు పుట్టింటికి వస్తుంది. ఆమె కొద్దిరోజులు అక్కడే ఉండవలసి వస్తుంది. అవి దసరా రోజులు. అనుకోకుండా రావడంతో ఆమె దగ్గర పండుగకు సరిపడే చీరలూ, నగలూ లేవు. అందుకే పండుగకు పెట్టుకోవడానికి కాళ్ల కడియాలూ, పట్టుచీరా అడుగుతుంది. మొదటి ఆరుగురు వదినలూ ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. చివరి వదిన మాత్రం తీసుకున్న కడియాలు సొట్టపోయినా, చీర చిరిగిపోయినా బాగుండదని హెచ్చరిస్తుంది. కానీ పండుగ సమయంలో ఆటలాడటంతో కడియాలు సొట్టబోయి, వాటికి తగులుకుని చీర చిరిగిపోతుంది. భర్తతో కొట్లాడి సొంత అన్నతోనే ఆడపడుచును చంపిస్తుంది చిన్నవదిన. చివరికి ఆమె చనిపోయిన చోట అందమైన కొలను ఏర్పడుతుంది. కాశీ నుంచి తిరిగివచ్చిన తల్లిదండ్రులు అందులో తామరను కోయబోతే ముట్టుకోవద్దని కూతురి గొంతు వినిపిస్తుంది. ఈ కథలను చిలుకా గోరింకలుగా మారిన ఆమె కళ్లు భర్తకు చెబుతాయి. ఆ రాజ్యపు ఆడపిల్లలంతా పదిరోజులు పూలగౌరిని పేర్చి ఆ కొలనులో వదిలితే చివరి రోజు పదహారేళ్ల బాలాకుమారిగా తిరిగి వస్తానని పలుకుతుంది తామర. అలా దసరా పండుగ సమయంలో ఆడబిడ్డ బతికివచ్చిన గుర్తుగా ఇప్పటికీ బతుకమ్మను పేర్చుకుంటున్నారని ప్రాచుర్యంలో ఉన్న ఒక గాథ.

స్టొరీ – 4

దక్షిణ భారతదేశానికి చెందిన చోళ రాజ్యానికి రాజు ధర్మాంగదుడు. ఆయనకు పుట్టిన వందమంది కుమారులు యుద్ధంలో చనిపోతే శ్రీమహాలక్ష్మి కోసం భార్యాభర్తలిద్దరూ తపస్సు చేసి ఆమె అనుగ్రహం పొందుతారు. సిరుల తల్లి వాళ్ల కడుపున పుడుతుంది. చిన్నతనంలో ఎన్నో గండాలను దాటి, మహిమలు చూపిస్తుంది. అందుకే ఆమె చల్లగా ఉండాలని బతుకమ్మా అని పిలిచేవాళ్లనీ, లక్ష్మీదేవి అంశ కాబట్టి ఆమెకు పూజలు చేసేవారన్నది తెలంగాణలో ధర్మాంగదుడి కథగా పాటల రూపంలో ప్రాచుర్యంలో ఉన్న మరో కథనం. నిజాం నవాబుల కాలంలో అధికారుల దాష్టీకానికి బలైపోయిన ఆడపిల్లల గుర్తుగా వాళ్లను తలుచుకుంటూ, ఇలాంటి కష్టం మరెవరికీ రాకుండా చూడమంటూ గౌరీదేవిని ఇలా బతుకమ్మగా పూజిస్తున్నారన్నది చరిత్రకారులు చెబుతున్న ఇంకో కథనం.

స్టొరీ – 5

కాపు దంపతులకు ఏడుగురు సంతానం పుడితే ఒక ఆడపిల్ల బతుకుతుంది. ఆమెకు బతుకమ్మ అనే పేరు పెడతారు. ఆ తర్వాత అబ్బాయి పుడతాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు అవుతాయి. ఒకసారి వదినా మరదళ్లు చెరువుగట్టున స్నానం చేసి వస్తారు. అప్పుడు ఒకరి చీరను మరొకరు ధరిస్తారు. ఈ విషయంలో మాటామాటా రావడంతో ఆడబిడ్డను చంపేసి, చెరువుగట్టునే పాతి పెడుతుంది మరదలు. ఆ ప్రాంతంలో తంగేడు విరగబూసిందట. తన బాధను భర్తకు కలలో కనిపించి చెప్పిందట బతుకమ్మ. అప్పటినుంచి ఆమె గుర్తుగా తంగేడుపూలతో బతుకమ్మను పేర్చి పండుగ చేశారట.

నైవేద్యాలు

బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పువ్వులు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలు ఒక్క రోజు మినహా మిగతా ఎనిమిది రోజులు ఒక్కొక్క రకమైన నైవేద్యం సమర్పిస్తారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలు మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా పేర్కొంటారు.

మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ

బతుకమ్మ మొదటి రోజును పెత్రమాస అని పేర్కొంటారు. స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు. సాయంకాలం ఎంగిలిపూల బతుకమ్మ ను ప్రారంభిస్తారు. నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, పుట్నాలు, బెల్లం ప్రసాదంగా పెడతారు.

రెండవ రోజు అటుకుల బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను అటుకుల బతుకమ్మ గా ఆరాధిస్తారు. ఈ రోజున ప్రధానంగా నివేదించే వి అటుకులు కాబట్టి అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు.

అటుకుల బతుకమ్మను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. నైవేద్యంగా అటుకులు, బెల్లం, చప్పిడి పప్పు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ

మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈరోజు ముద్దపప్పు, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా, అమ్మవారికి సమర్పిస్తారు.

నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ

నాలుగో రోజును నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు. ఆ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం సమర్పిస్తారు.

ఐదవ రోజు అట్ల బతుకమ్మ

ఈ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ గా పిలుస్తారు. ఈ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. బియ్యం, మినప గుళ్ళు బాగా నానబెట్టి రుబ్బుకుని అట్లు పోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరవ రోజు అలిగిన బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అలిగిన బతుకమ్మగా గౌరమ్మను వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలు ప్రార్థిస్తారు.

ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ

ఏడో రోజును ‘వేపకాయ బతుకమ్మ’గా అభివర్ణిస్తారు జానపదులు. ఆ రోజు బియ్యపుపిండిని బాగా వేయించి వేపపండ్లలా తయారుచేసి అమ్మకు సమర్పిస్తారు.

8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ

ఎనిమిదో రోజును ‘వెన్నముద్దల బతుకమ్మ’ అంటారు. ఈ రోజున నువ్వులు, వెన్న/నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారుచేసి, అమ్మవారికి సమర్పిస్తారు.

తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ

చివరిరోజు ‘సద్దుల బతుకమ్మ’. ఆశ్వయుజ అష్టమి నాడు నిర్వహించే సద్దుల బతుకమ్మ రోజునే దుర్గాష్టమి జరుపుకొంటారు. చివరిరోజున అమ్మవారి కోసం ఐదురకాల నైవేద్యాలు తయారుచేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం.. వీటితోపాటుగా మక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, పునాసదోస, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. ఐదు రకాల దినుసులతో చేసే నైవేద్యాన్ని సత్తుపిండి అంటారు. రొట్టె, బెల్లం /చక్కెర కలిపి తయారు చేసిన మలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుందని విశ్వాసం.

Other resources:

Bathukamma WikiPedia : https://en.wikipedia.org/wiki/Bathukamma


Spread the word

Leave a Comment