Monday, 8/3/2021 | 12:02 UTC+5

ఉగాది పండగ

ఉగాది అంటే ?

ఉగాది మన తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే పండగ. ఈ పండగను తెలుగు నూతన సంవత్సరం యొక్క మొదటి రోజుగా జరుపుకుంటాము. ఇది తెలుగువారి మొదటి పండుగ.

మన భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.

ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ మన ఉగాది-పర్వదినం.

ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.


ఉగాది అనేపదం ఏవిధంగా వచ్చింది?

ఉగ” అనగా నక్షత్ర గమనము – జన్మ – ఆయుష్షు అని అర్థాలు.  

ఆది” అనగా మొదలు, మొదటి, ప్రారంభం అనే అర్థాలు.

ఈ రెండూ ఉగస్య మరియు ఆది కలిపి ఉగాది అయ్యింది. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది.

మరొక విధంగా ‘యుగము’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది.


ఉగాది పుట్టుపూర్వోత్తరాలు

ఉగాది ప్రారంభానికి వివిధరకాల వృత్తాంతాలు ఉన్నాయి.

వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి.

చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది.

శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం.

ఏది ఏమైనా మనలో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’.

“ఉగాది” తెలుగు నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం వేడుకగా మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు. ఉగాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో కొత్త క్యాలెండర్ ప్రారంభంగా గుర్తించబడింది. దేశవ్యాప్తంగా మరియు ఉగాది న్యూ ఇయర్ జరుపుకునే ప్రదేశాలలో అనేక సంప్రదాయాలు ఈ రోజున గమనించబడతాయి.


ఉగాదిని ఎలా జరుపుకుంటాము?

ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తాము.. ఆ రోజున ప్రొద్దున్నే లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటాము. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.


“ఉగాది పచ్చడి” ప్రాముఖ్యం?

ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి మన తెలుగువారికి ప్రత్యేకం.

సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఎక్కడెక్కడ ఉగాది పండగను జరుపుకుంటాము?

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు.

ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’ పేరుతో పిలుస్తారు.

తమిళులు “పుత్తాండు” అనే పేరుతో, మలయాళీలు “విషు” అనే పేరుతోను, సిక్కులు “వైశాఖీ” గానూ, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” గానూ జరుపుకుంటారు.
అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది.

మూలాలు: ఉగాది – వికీపీడియా

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved. 2017. Our Privacy Policy.